జాతీయం ముఖ్యాంశాలు

10, 11 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు

తమిళనాడులో ఈ నెల 10, 11 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ నెల 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో తమిళనాడుతోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు 9వ తేదీలోగా తిరిగి రావాలని సూచించింది.

కాగా, గత 24 గంటల్లో చెన్నైలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదైనట్లు ఐఎండీ డీజీ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. సోమవారం వర్ష తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని అన్నారు. అయితే 10,11 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొత్తగా ఏర్పడే అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించినప్పుడు 12వ తేదీ నుంచి వర్షాలు తగ్గుతాయని వివరించారు.