స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 26. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి, 14న ఓట్లను లెక్కించనున్నారు. 10వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.