తమిళనాడులో వరుణ బీభత్సం కొనసాగుతున్నది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు ( Tamil Nadu rains ) కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో దాదాపు వీధులన్నీ కొలనుల్లా మారిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెగని వర్షాలకు నాగపట్టణం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 10, 11 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన జిల్లాల్లో చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగల్పట్టు, కడలూర్, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్, మైలదుత్తురాయ్ ఉన్నాయి. ఆయా జిల్లాలో రానున్న కొన్ని గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదిలావుంటే కడలూర్, విల్లుపురం, శివమొగ్గ, రామనాథపురం, కరైకాల్ జిల్లాలకు ఇవాళ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది.