అంతర్జాతీయం

చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌!

చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ కొనసాగేందుకు మార్గం సుగమం చేస్తూ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీసీ) ‘చారిత్రక తీర్మానా’న్ని ఆమోదించింది. పార్టీ వందేండ్ల చరిత్రలో ఈ తరహా తీర్మానాన్ని ఆమోదించడం ఇది మూడోసారి. రాజధాని బీజింగ్‌లో మూడు రోజుల సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీ గురువారం ముగిసింది. దేశాధ్యక్ష పదవితో పాటు సీపీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌ పదవుల్ని కూడా 68 ఏండ్ల జిన్‌పింగే నిర్వహిస్తున్నారు. సీపీసీ పొలిట్‌బ్యూరోలో రిటైర్మెంట్‌ వయసు 68 ఏండ్లు. జిన్‌పింగ్‌ ఆ వయసుకు చేరుకున్నారు. వచ్చే ఏడాదితో చైనా అధ్యక్షుడిగా పదేండ్ల పదవీకాలం పూర్తవుతుంది. ప్రస్తుతం ఆయన రెండోసారి చైనా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చైనా నిబంధనల ప్రకారం ఉన్నత నాయకులెవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదు. అయితే ఈ నిబంధనకు 2018లో జిన్‌పింగ్‌ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.