తెలంగాణ

ఏడేండ్లు నాన్చింది మీరే

  • ఫిర్యాదుపై స్పందించనందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాం
  • ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తే కేసు వీగి పోయేది కదా?
  • కృష్ణాలో న్యాయమైన వాటా కోసమే మా పోరాటం
  • మీ మీద నమ్మకంతో కేసు ఉపసంహరించుకున్నాం
  • ఇప్పటికైనా కొత్తగా ట్రిబ్యునల్‌ వేయండి
  • కేంద్ర మంత్రి షెకావత్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి

కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేసింది కేంద్రమేనని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టం చేశారు. నీళ్ల పంపిణీలో ఏపీ అక్రమాలపై రాష్ట్రం ఏర్పడిన 42 రోజులకే కేంద్రానికి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. 13 నెలలపాటు ఓపిక పట్టి కేంద్రం నుంచి స్పందన రాకపోవడం వల్లనే సుప్రీంకోర్టు గడప తొక్కాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడేండ్లలో కేంద్రం ఎప్పుడు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసినా తాము దాఖలు చేసిన కేసు వీగిపోయేదని వివరించారు. సిద్దిపేట క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం మంత్రి హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసమే తాము ఏడేండ్లుగా పోరాడుతున్నామని చెప్పారు. తాము స్వరాష్ట్రం కోసం పోరాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని గుర్తుచేశారు. నదుల వాటాలో మా నీళ్లు మాకు దక్కాలని కోరుతున్నామని, కానీ కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నదని చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతంలోలేని ప్రదేశాలకు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో తమకు న్యాయంగా దక్కాల్సిన నీరు దక్కడం లేదని, అందుకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని కోరామని వెల్లడించారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం నీటి పంపకాలపై ఏదైనా రాష్ట్రం ఫిర్యాదుచేస్తే దాన్ని ఏడాదిలోగా పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే (2014, జూలై 14న) అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు తాను ఏడాదిపాటు ఢిల్లీలోని జల్‌శక్తి మంత్రిత్వ శాఖ చుట్టూ తిరిగామని, ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి అధికారులకు విన్నవించామని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం స్పందించలేదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 13 నెలల తర్వాత 2015 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు గడప తొక్కామని హరీశ్‌రావు వివరించారు. కోర్టుకు వెళ్లినా సెక్షన్‌-3 కింద నిర్ణయం తీసుకోవడానికి వచ్చిన అడ్డంకి ఏమిటని నిలదీశారు. ‘మేము ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరేందుకే కోర్టుకు వెళ్లాం. మీరు ఏర్పాటు చేస్తే కేసు వీగిపోతుంది కదా’ అని వ్యాఖ్యానించారు. ‘మీ (షెకావత్‌) మీద గౌరవంతో కేసును ఉపసంహరించుకున్నాం. ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి’ అని విజ్ఞప్తిచేశారు. తక్షణమే బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కైనా అప్పగించాలని లేదా కొత్త ట్రిబ్యునల్‌నైనా ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, యాదవరెడ్డి, బక్కి వెంకటయ్య, వేణుగోపాల్‌రెడ్డి, ఎడ్ల సోంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.