తెలంగాణ

మర్లబడ్డ రైతన్న

  • ఢిల్లీ సర్కారుపై..తెలంగాణపైఎందుకీ వివక్ష
  • యాసంగి వడ్లు కొంటరా? లేదా?.. కొనేదాకా పోరు ఆగదు
  • అన్నదాతలు తిరగబడితే.. బీజేపీ నలిగిపోతుంది జాగ్రత్త
  • రైతు పక్షాన తెలంగాణ ప్రభుత్వం.. వ్యతిరేకంగా కేంద్రం
  • ఢిల్లీ బీజేపీది ఒక మాట.. గల్లీ బీజేపీ నేతలది మరో మాట
  • కార్పొరేట్‌ సంస్థలకు దాసోహమంటున్న మోదీ విధానాలు
  • టీఆర్‌ఎస్‌ మహా ధర్నాల్లో మండిపడిన రాష్ట్ర మంత్రులు
  • గర్జించిన అన్నదాతలుటీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు
  • కేంద్రం యాసంగి వడ్లు కొంటదా? లేదా?

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల రైతన్నలు అడిగిన ఒకే ఒక్క సూటి ప్రశ్న! తెలంగాణపై కక్షను, వివక్షను, పక్షపాతాన్ని, క్షుద్ర రాజకీయాలను వీడి.. అన్నదాత గోస తీర్చాలన్న ఒకే ఒక్క డిమాండ్‌!
రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిలదీస్తూ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర రైతన్నలు మర్లబడ్డారు. అన్నదాతల పోరు కేకలతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు దద్దరిల్లాయి. బైకు ర్యాలీలు, డప్పు దరువులతో వీధులు దుమ్మురేపాయి. వరి కంకులు చేతబూని.. గులాబీ జెండాలు భుజానికెత్తుకుని వేల సంఖ్యలో మహాధర్నా కేంద్రాలకు తరలివచ్చిన రైతులు.. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం వెంటనే సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లులేక పొలాలను పడావు పెట్టుకున్న రోజుల నుంచి.. దర్జాగా రెండు పంటలు పండించుకునే స్థితికి చేరుకొని.. ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న తమ జీవితాలను విధానాల పేరుతో కేంద్రం బుగ్గిచేయడంపై అగ్గి రాజేశారు.

రైతుల పట్ల విపక్ష చూపుతూ ప్రధాని మోదీ ఉరితాళ్లు పంపుతున్నారు. యాసంగి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి. కేంద్రానికి అమ్మడం తప్ప కొనడం చేతకాదా? ఆస్తులు అమ్మడానికి కేంద్రంలో మీ పాలన అవసరమా? వేగంగా ఎదుగుతున్న తెలంగాణకు అండగా నిలుస్తారా.. ఓర్వలేక కాళ్లలో కట్టెలుపెడతారా? కేంద్రం నిర్ణయించుకోవాలి. కొత్త వ్యవసాయ చట్టాలతో నిబంధనలు మార్చి కార్పొరేట్ల దోపిడీకి కేంద్రం మార్గం సుగమం చేసింది.

మంత్రి నిరంజన్‌రెడ్డి

యాసంగి వడ్లను కేంద్రం కొనాల్సిందే. పంటలు పండించేందుకు సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ర్టాలది. పండిన పంటను సేకరించే బాధ్యత కేంద్రానిది. తెలంగాణ రైతులు సమృద్ధిగా పంటలు పండించుకొని ఆర్థికంగా ఎదుగుతున్న దశలో కండ్లు మండిన కేంద్రం వడ్లు కొనబోమని కొర్రీలు పెడుతున్నది. ధాన్యం సేకరణపై మూడు రోజుల్లోగా కేంద్రం ఉత్తర్వులు ఇవ్వకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇండ్ల ముందు ధర్నా చేస్తాం.

-పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

పంజాబ్‌లో సుమారు 2 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణపై వివక్ష చూపుతూ ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నది. కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసేందుకు తెలంగాణ రైతులు, టీఆర్‌ఎస్‌, మా మంత్రులు, ప్రజాప్రతినిధులు సిద్ధం.

-రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

కదిలిందిర తెలంగాణ ఖబడ్దార్‌.. ఖబడ్దార్‌. కదిలిండుర రైతన్న ఖబడ్దార్‌.. ఖబడ్దార్‌. రైతన్న వరికి ఉరివేస్తే బీజేపీకి ఘోరీ కడుతం.. వడ్లు కొనటం ఆపొద్దు.. రైతుల ఉసురు తీయొద్దు.. తెలంగాణ అంతటా ఇవే నినాదాలు మార్మోగాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, గొర్రు, నాగలి, పలుగు, పార, పగ్గంతో రైతన్న కదం తొక్కాడు. యాసంగి వడ్లు కొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రమంతా శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించాయి. ఊరూవాడా మళ్లీ నాటి తెలంగాణ ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించాయి. మహాధర్నా సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉరకలెత్తే ఉత్సాహం తొణకిసలాడింది. సీఎం కేసీఆర్‌ పిలుపునిస్తే యావత్‌ తెలంగాణ ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుందని ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది. మంత్రులు, నాయకులు వారి హోదాలను మరచి జనంతో మమేకమయ్యారు. తమ పూర్వ ఉద్యమరూపాలను ఆవిష్కరించారు. రైతులు తమ పంటలతో ధర్నా ప్రాంగణాలకు తండోపతండాలుగా తరలివచ్చారు. వరిగొలుసులు, జొన్నకంకులు నిరసన జెండాలై ఎగిరాయి. రైతులు, యువకులు ధర్నాల్లో పాల్గొని ఉద్యమస్ఫూర్తిని చాటారు. అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి బాధ్యులు, గ్రామం నుంచి రాష్ట్రం దాకా అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపీని తరిమికొట్టుడే..

పంజాబ్‌తోపాటు పలు రాష్ర్టాల్లో మొత్తం పంటను కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణపై సవితి ప్రేమను చూపుతున్నదని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. బీజేపీకి మత విద్వేషాలు రగించడమే తప్పా ప్రజల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తై పుష్కలంగా సాగునీరు వస్తుండటంతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతుంటే.. చూడలేకపోతున్నా కేంద్రం మోకాలడ్డే నిర్ణయాలుతీసుకుంటున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో వడ్లు కొనకుంటే తిరగబడటం ఖాయమన్నారు. ఢిల్లీ బీజేపీ నాయకులు వరి వద్దంటే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి సాగుచేయమని రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. శుక్రవారం జరిగింది ట్రైలర్‌ మాత్రమేనని.. వరి సాగు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తెలంగాణ రైతులు బీజేపీ బొందపెడ్తరని హెచ్చరించారు.

ట్రెండింగ్‌లో యాంటీ ఫార్మర్‌ బీజేపీ హ్యాష్‌ ట్యాగ్‌

రైతుల ఉసురు తీస్తున్న బీజేపీపై నెటిజన్లు దండెత్తారు. వివాదాస్పద సాగుచట్టాలతో రైతులను అనాథలుగా మార్చటమే కాకుండా, పంట కొనుగోళ్లపై బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దుమ్ముదులిపేస్తున్నారు. ఈ దండయాత్రలో గులాబీ శ్రేణులు ముందున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన రైతు మహాధర్నా పిలుపుతో నెటిజన్లు బీజేపీని చీల్చి చెండాడుతున్నారు. ‘తెలంగాణలో పండే యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రైతన్నలకు అండగా నిలుద్దాం.. జై తెలంగాణ’ అంటూ ని పోస్టులు పెడుతున్నారు.

సోషల్‌మీడియా నిండా మహాధర్నాయే..

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ మహాధర్నాకు విశేష స్పందన వచ్చింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులు, ప్రజలు ఉద్యమ కూడళ్లకు తరలివచ్చి కేంద్రంపై నిరసన వ్యక్తంచేస్తూ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేశారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాల్లో రైతు సంఘీభావ దీక్ష వైరల్‌గా మారింది. యాంటీ ఫార్మర్‌ బీజేపీ హ్యాష్‌ ట్యాగ్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవుతున్నది. సామాన్యుల నుంచి ఎన్‌ఆర్‌ఐల వరకు తమ నిరసనను సోషల్‌ మీడియాలో వ్యక్తంచేశారు. ‘రైతు కన్నెర్రకు బీజేపీ పార్టీ భస్మం కాకతప్పదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర వడ్లు కొనడం ఆపొద్దు.. రైతుల ఉసురు తీయొద్దు అని రిక్వెస్ట్‌ సింబల్స్‌తో పోస్టులు పెడుతున్నారు. ‘రైతు సంఘీభావ దీక్షతో ఢిల్లీకి సెగ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ డౌన్‌డౌన్‌, రైతులకు అండగా నిలుద్దాం’ వంటి నినాదాలతో రకాల ప్లకార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వరికట్టల ఫొటోలతో మహాధర్నాలో పాల్గొన్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆ ఫోటోలు షేర్‌ చేస్తూ వివిధ వ్యాఖ్యలు జోడిస్తూ డీపీ, పోస్టులు, స్టేటస్‌లుగా పెట్టుకున్నారు. పంజాబ్‌ రైతుపై ప్రేమ..తెలంగాణ రైతుపై కక్షా? అని కేంద్రాన్ని నిలదీశారు. అధికార పార్టీ నాయకులు ధర్నాలు చేయడమేంటని కొంతమంది బీజేపీ కార్యకర్తలు చేసిన పోస్టుపై నెటిజన్లు విరుచుకపడ్డారు. ‘కేంద్రం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే ఊరుకోవాలా? రైతులను నాశనం చేయడమే బీజేపీ ఎజెండానా? అని నిలదీశారు.

ప్రత్యేక ఆకర్షణగా..!

సోషల్‌మీడియాలో ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. సీఎం కేసీఆర్‌ ఫొటో, టీఆర్‌ఎస్‌ జెండాతో జై టీఆర్‌ఎస్‌ అని రాసి ఉన్న జెండాను రైతులు పట్టుకొని కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో ర్యాలీ తీస్తున్న ఫొటో వైరల్‌ అవుతున్నది. ఈ ఫొటోకు గులాబీ జెండా చేపట్టి, జంగ్‌ సైరన్‌ పూరిద్దాం.. ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటుదాం అని క్యాప్షన్‌ జోడించారు. వరికట్టలతో రైతుమహా ధర్నాలో పాల్గొని ర్యాలీగా ఉన్న మరో ఫొటో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. నాడు రాష్ట్రం కోసం కొట్లాడిన కేటీఆర్‌, నేడు రైత కోసం అంటూ కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఫొటో కూడా వైరల్‌ అవుతున్నది. మొత్తంగా సోషల్‌ మీడియాలో నెటిజన్ల ఖాతాలన్నీ బీజేపీ వ్యతిరేక పోస్టులతో నిండిపోయాయి.

రైతన్నలకు అండగా నిలుద్దాం: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‘ తెలంగాణలో పండే యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రైతన్నలకు అండగా నిలుద్దాం. జై తెలంగాణ.. రైతు వ్యతిరేక బీజేపీ’ అని హ్యాష్‌ ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

మేము తవ్వుకున్న గుంతలో మేమే పడ్డం సార్‌

  • మంత్రి హరీశ్‌రావుతో మహిళా రైతుల ఆవేదన

‘మీరు ఎంతజెప్పినా వినకపోతిమి సార్‌.. బీజేపీకి ఓటు వెయ్యొద్దు అంటే వేస్తిమి.. గిప్పుడు గా బీజేపోళ్లు వడ్లు కొనమంటుండ్రు.. మేము తవ్వుకున్న గుంతలో మేమే పడ్డాం సార్‌’ అంటూ మంత్రి హరీశ్‌రావుతో దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం లింగాపూర్‌కు చెందిన మహిళా రైతులు వాపోయారు. ఇటీవల మృతిచెందిన తొగుట జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి దశదిన కర్మకు శుక్రవారం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా లింగాపూర్‌లో మహిళారైతులు మంత్రి కారును ఆపి వారి బాధలు చెప్పుకొన్నారు. ఏమమ్మా బాగున్నారా? అని హరీశ్‌రావు వారిని క్షేమ సమాచారం అడగగా .. ‘ఏం బాగా సార్‌.. అంతా ఆగంలో ఉన్నాం.. గా బీజేపోళ్లు వడ్లు కొనమంటుండ్రు.. గీ యాసంగిలో వరి వద్దు అంటుండ్రు.. ఏమి చేయాలో అర్థం కావడం లేదు సార్‌’ అని ఆవేదనగా చెప్పారు. ‘నేను ఎంత చెప్పినా విన్నారా.. వొద్దు వొద్దు అన్నా బీజేపీకి ఓట్లు వేసిండ్రు’ అని హరీశ్‌రావు అనగానే.. నిజమే సార్‌ మీరు చెప్పినా వినకపోతిమి అంటూ వాపోయారు. యాసంగిలో వరి సాగు కోసం బీజేపీ వాళ్లతో కొట్లాడుదాం అని మంత్రి వారికి ధైర్యం చెప్పి వెళ్లారు.