సిక్కులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరువాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అమిత్‌షా మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయం గురునానక్ దేవ్‌జీ పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
సిక్కులకు ఆరాధ్య దైవమైన గురునానక్ తల్లిదండ్రులు ఇక్కడే మరణించగా.. బాబా గురునానక్ తన జీవితం చివరి రోజుల్లో ఇక్కడే కాలం గడిపారు. 17 సంవత్సరాల పాటు వ్యవసాయం చేశారు. ఇదిలా ఉండగా.. గురునానక్ గురుపరబ్ (జయంతి) ఈ నెల 19న జరుగనున్నది. ఈ సందర్భంగా 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులకు పాక్‌కు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్-పాక్ మధ్య 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్స్ మేరకు నవంబర్ 17-26 మధ్య యాత్రికులు అత్తారి – వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ద్వారా పాక్‌లో ఉన్న గురుద్వారాను సందర్శిస్తారని విదేశాంగ శాఖ పేర్కొన్నది. కొవిడ్ మహమ్మారి కారణంగా మార్చి 2020లో కర్తార్‌పూర్ కారిడార్‌ను నిలిపివేశారు.