దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతున్నది. దాంతో వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను కట్టడి చేయడం కోసం ఇప్పటికే ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 18తో ఈ క్యాంపెయిన్ ముగియనుండటంతో మరో 15 రోజులు పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. రెండో విడత ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’ క్యాంపెయిన్ ఈ నెల 19 నుంచి డిసెంబర్ 3 వరకు కొనసాగుతుందన్నారు.
అదేవిధంగా ఢిల్లీలో కాలుష్యం కట్టడిపై ఇవాళ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నామని గోపాల్ రాయ్ తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో నిర్మాణ పనులపై నిషేధం విధించాలని, పరిశ్రమలను మూసివేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించనున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం 4 శాతం, 35-40 శాతం కొయ్యకాలు కాల్చివేత కూడా వాయు కాలుష్యానికి కారణమని పేర్కొన్నదని, ఈ శాతం విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వాలని గోపాల్ రాయ్ అన్నారు.