రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల నమోదుకు సంబంధించిన వ్యయ రేట్లను ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రచార ఖర్చుల వారీగా రేట్ల ఖరారు అంశంపై సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ సమీక్షించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సమయంలో తమ ప్రచారం నిమిత్తం చేసే ఖర్చు వివరాలు ఎన్నికల కమీషన్ తరపున నియమించబడిన అకౌంటింగ్ బృందాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో చేసే వివిధ కార్యక్రమాలలో వినియోగించే వివిధ పరికరాల రేట్లను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు ప్రకారం ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో ఉన్న అభ్యంతరాలు చర్చించి వాటిని సవరించి, తుది రేట్ల జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేసే వివిధ కార్యక్రమాల ఖర్చు లెక్కింపు ముందుగా అందజేసిన రేట్ల ప్రకారం నమోదు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.జే.పి. పార్టీ ప్రతినిధి పోల్సాని సంపత్ రావు, సిపిఐ(ఎం) పార్టీ ప్రతినిధి ఏ. ముత్యం రావు, బీఎస్పి పార్టీ ప్రతినిధి ఎన్. గోపాల్ యాదవ్, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రతినిధి ఎస్. ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆర్. ప్రశాంత్ , తెదేపా పార్టీ ప్రతినిధి ఏ.తిరుపతి, ఎన్నికల డి.టి. ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.