తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
సంవత్సరానికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్ వివరాలును రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని కేంద్రానికి రేపు లేఖ రాస్తాను. తమకు సమాధానం కావాలి. పెండింగ్ పెడుతామంటే కుదరదు. తెలంగాణ రైతాంగం తరపున డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్ మహాధర్నా చేపడుతున్నాం. రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితిల జిల్లా అధ్యక్షులతో కలిసి మహాధర్నా చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టం. రైతులను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతున్నాం. రేపు మధ్యాహ్నం లోపు మోదీకి, ఆహార శాఖ మంత్రికి లేఖ పంపిస్తాం. కేంద్రం విధానాలను స్పష్టం చేయాలి. బీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజన్ చేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగమైన రైతులను అద్భుతంగా కాపాడుకుంటున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం. తక్షణమే డబ్బులు కూడా పంపిణీ చేశాం. యాసంగి పంటలకు రైతు బంధు డబ్బులు త్వరలోనే ఇస్తాం. యాసంగిలో వరి పంటను వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో ధర్నాలో నిరసన వ్యక్తం చేస్తాం. అప్పటికీ స్పందన లేకపోతే ప్రజలే తేల్చుతారు. ఈ నెల18 తర్వాత కూడా మా పోరాటం కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.