వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్న. యాసంగిలో నువ్వు వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే. నేను పొరపాటు చెప్పిన అని చెంపలు వేసుకోవాలే. వేయకండి అని చెప్పాలే నీకు నిజాయితీ ఉంటే. క్లియర్‌గా అడిగినం వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తదా? లేదా? కొంటరా కొనరా? దానికి సమాధానం లేదు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడడం. అర్ధరహితమైన మాటలు మాట్లాడడం.. మాట్లాడుకుంటూ రైతులపై దాడులు చేసుకుంటూ పోతున్నరు.
ఇది క్షమించేటటువంటి విషయం కాదు. దీన్ని చాలా సీరియస్‌గా మేము కూడా తీసుకుంటున్నం. ఫైనల్‌గా మా శాసన సభ్యులను పిలిచి సమాలోచనలు చేసినం. రైతాంగం ఎదురు చూస్తున్నరు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతది.. కేంద్రం ఏం చెబుతదని.. కేంద్రమేమో ఏం తేల్చది. వీళ్లు తేల్చే రకాలు కాదు. ఎందుకంటే సంవత్సర కాలంగా ఢిల్లీ రైతులు ధర్నా చేస్తే, ఆల్రెడి 600 మంది రైతులు సచ్చిపోతే వారిని పట్టించుకునే దిక్కు లేదు. ఉల్టా వాళ్ల మీద కార్లు ఎక్కించి తొక్కి సంపుతున్నరు. ఉత్తరప్రదేశ్‌లనేమో రైతులపై కార్లు ఎక్కించి సంపింన్రు. ఆ ఉదందం ఉంది. సుప్రీం కోర్టు విచారణ చేస్తున్నది. కేసు పెట్టబడ్ది. ఇక్కడ రైతులు అడిగితే ధాన్యం కొంటరా కొనరా? అని అడిగితే.. అది చెప్పకుండా ఇంకేదో పిట్టకథ, ఈ కథ ఆ కథ చెప్పి దర్మార్గమైన పద్ధతిలో వ్యవహారం చేస్తున్నరు. ఇది రాజకీయం కాదు.
రాజకీయం అనబడదు. దీని ద్వారా మీ పతనమే తప్ప లాభం జరుగదు. ఏదో అడ్డగోలుగా, పిచ్చిపిచ్చి మాట్లాడి, ఏదిపడితే అది మాట్లాడి.. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రభుత్వం చూస్తు ఊరుకోదు. వీరు సృష్టిస్తున్న కన్ఫ్యూజన్‌లో మేం కొంటనే ఉంటిమి అక్కడికి ధర్నా చేయడమేంది. ఇంకా టీఆర్‌ఎస్ మీద బద్నాపం పెట్టడం. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు వడ్లు ఉండయా? పొలాలు ఉండయా? కొనుగోలు కేంద్రాల కాడ టీఆర్‌ఎస్ నేతలు ఉండరా.. వడ్లు అమ్ముకోవడానికి రారా.. టీఆర్‌ఎస్‌కు 60లక్షల సభ్యత్వాలున్నాయి. 60 లక్షల్లో లక్షలాది మంది రైతులు ఉంటరు. వాళ్లు అమ్ముకోవడానికి రారా కొనుగోలు కేంద్రాల కాడికి.. తప్పుకుండా నిన్ను నిలదీస్తురు.
నిలదీస్తే తప్పేంది. తప్పకుండా నిన్ను టీఆర్‌ఎస్సే నిలదీస్తది.. ఎందుకు నిలదీయకూడదు. మొన్న ఎట్ల చెప్పిన బాధ్యత రహితంగా యాసంగిలో వరే వేయండి అని చెప్పినవ్. మెడలు వంచుతమ్ అని చెప్పినవ్ కాబట్టి.. మరి వరి వేయమంటవా వద్దంటావా నీ సంగతేందని అడుగుతున్నరు. అడిగితే నువ్వు దాడులు చేస్తున్నవ్.. రాళ్లతో కొట్టిస్తున్నవ్. కర్రలు, జెండాలు పట్టుకొని పోయి కొడుతున్నరు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.