- చిన్న రైతులు యంత్రాలు కొనగలరా?
- వాహనాలే కాలుష్యానికి ప్రధాన కారణం
- ఢిల్లీ రోడ్లపై తిరిగే ‘హైఫై’ కార్లను ఆపారా?
- అధికారుల్లో జడత్వం పెరిగిపోయింది
- టీవీ చానళ్ల డిబేట్లతో మరింత పొల్యూషన్
- ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- పలు చర్యలు చేపట్టినట్టు తెలిపిన కేంద్రం
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మంగళవారం నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయాలని కేంద్రం, ఢిల్లీ సరిహద్దు రాష్ర్టాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ … కేంద్రం, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాలతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్లు, వాహనాలు, డీజిల్ జనరేటర్లతో వెలువడుతున్న కాలుష్యం, దుమ్ము ధూళి నియంత్రణకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
వీటి గురించి బుధవారం సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదని, ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్రం, రాష్ర్టాలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు ఢిల్లీలో స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులపై నిందలు వేస్తుంటారని వ్యాఖ్యానించింది.
రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతుండటమే వాయు కాలుష్యానికి కారణమన్న వాదనపై ఈ వ్యాఖ్యలు చేసింది. ‘చిన్నపాటి కమతాలతో రైతులకు వచ్చే ఆదాయమెంత? వారు పంట వ్యర్థాలను నాశనం చేసే యంత్రాలను కొనగలరా?’అని ప్రశ్నించింది. ఇప్పటికీ హై-ఫై కార్లు ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్నా చేసిందేమీ లేదని పేర్కొంది. అధికారుల్లో జడత్వం పెరిగిపోయిందని,ప్రతి పనిని కోర్టుకే వదిలేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ వార్తా చానళ్లలో చర్చలు మిగతావాటి కంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిసున్నాయన్నది. ఎన్‌సీఆర్ పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకోవాలన్నది.
ఢిల్లీలోకి లారీల రాకపై నిషేధం
నిత్యావసరాలను సరఫరా చేసేవి మినహా మిగతా లారీలను ఈ నెల 21 వరకు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధిస్తూ ఢిల్లీ సర్కారు బుధవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే నిర్మాణ కార్యకలాపాలపైనా నిషేధం విధించింది. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేయాలని కోరింది.