జాతీయం ముఖ్యాంశాలు

పంజాబ్‌ హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్‌ దర్యాప్తు

లఖింపూర్‌ ఖీరీ రైతుల హత్య కేసు సిట్‌ దర్యాప్తును రోజూవారీగా పర్యవేక్షించేందుకు పంజాబ్‌, హర్యా నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. అలాగే కేసును విచారిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్‌) ఐజీ ర్యాంక్‌ పోలీసు అధికారి పద్మజా చౌహాన్‌ సహా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను నియమించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఐపీఎస్‌ అధికారుల జాబితాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం అంగీకరించింది. తాజాగా నియమించిన అధికారుల నేతృత్వంలో, మాజీ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించింది. కాగా, గత నెల 3న జరిగిన లఖింపూర్‌ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మరణించారు.