స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్.. అంటే చర్మాన్ని నేరుగా చర్మంతో తాకితేనే లైంగిక దాడి అవుతుందని, లేని పక్షంలో అలాంటి ఘటన పోక్సో చట్టంలోకి రాదు అని గతంలో ఓ కేసులో బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పు ఆదేశాలను కొట్టిపారేసింది. పోక్సో చట్టం కింద నేరాన్ని నమోదు చేయాలంటే.. లైంగిక వేధింపుల కేసులో చర్మాన్ని చర్మంతో తాకడం లాంటి కండిషన్ అవసరం లేదని సుప్రీం వెల్లడించింది. మైనర్ వక్షోజాలను నేరుగా తాకడం జరగనప్పుడు, అది పోక్సో లైంగిక వేధింపు కిందకు రాదు అని బాంబే హైకోర్టు ఓ కేసులో తీర్పును ఇచ్చింది. అయితే శారీరక వాంఛతో భౌతిక దాడి చేసినా అది పోక్సో కిందకు వస్తుందని సుప్రీం తన తీర్పులో తెలిపింది. బాంబే హైకోర్టు తీర్పును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వ్యతిరేకించారు. ఆ తీర్పు సరైన రీతిలో లేదన్నారు. సర్జికల్ గ్లౌజ్ వేసుకుని ఓ చిన్నారిని వేధించి తప్పించుకోవచ్చు అన్న రీతిలో ఆ తీర్పు ఉందని అటార్నీ జనరల్ వాదించారు. ఆ తీర్పును మూలంగా తీసుకుంటే, అప్పుడు దాని ఫలితాలు భయానకంగా ఉంటాయన్నారు.
అయితే ఈ కేసులో నిందితుడి తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లుథ్రా వాదించారు. లైంగిక వాంఛ తీరాంటే శారీరక స్పర్శ అవసరమని, కానీ ఈ కేసులో నిందితుడు నేరుగా తన చర్మంతో స్పర్శించలేదని, మధ్యలో దుస్తులు ఉన్నట్లు ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంలో వాదన సమయంలో స్పర్శ గురించి ఆసక్తికర చర్చ కూడా జరిగింది. టచ్ చేయడం అంటే ఏమీటి, అది కేవలం స్పర్శ మాత్రమేనా, ఒకవేళ దుస్తులు వేసుకున్నా.. వాళ్లు ఆ దుస్తుల్ని తాకేందుకు టచ్ చేయడం లేదు కదా, స్పర్శను పార్లమెంట్ నిర్వచించిన రీతిలో చూడాలని సుప్రీం పేర్కొన్నది. చట్టసభలు ఇలాంటి అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చినప్పుడు, అలాంటి అంశాలపై కోర్టులు అస్పష్టత క్రియేట్ చేయవద్దు అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. తీర్పునిచ్చిన సుప్రీం బెంచ్‌లో జస్టిస్ యూయూ లలిత్, ఎస్ఆర్ భట్, బేలా ఎం త్రివేదిలు ఉన్నారు. పోక్సో చట్టం ప్రకారం.. లైంగిక దాడి అంటే.. లైంగిక వాంఛతో చిన్నారుల మర్మాంగాలను తాకడమని, దీంట్లో భౌతికమైన వేధింపులు కూడా వస్తాయని ఉంది.
స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పై బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును అటార్నీజనరల్, జాతీయ మహిళా కమిషన్, మహారాష్ట్ర ప్రభుత్వం, యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు సుప్రీంలో సవాల్ చేశాయి. ఈ కేసు విచారణ సమయంలో నిందితుడి తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్ధ లుథ్రా వాదించారు. ఇక ఆయన సోదరి, సీనియర్ అడ్వకేట్ గీతా లుథ్రా.. జాతీయ మహిళా కమిషన్ తరపున వాదించారు. ఓ కేసులో అన్నాచెల్లెళ్లు విభిన్న వాదనలు వినిపించినట్లు సుప్రీం అభిప్రాయపడింది.