- చైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు
- ఎంపీ కేశినేని ఓటుతో టీడీపీకి మెజారిటీ
- వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు
- మరో వైస్ చైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మి
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు.
కాగా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరిగింది. ఎన్నిక ప్రక్రియను మరోసారి వాయిదా వేయించేందుకు వైసీపీ సభ్యులు కొత్త ఎత్తుగడ వేశారు. ఫలితం వెంటనే ప్రకటించ వద్దని హైకోర్టు చెప్పిన కారణాన్ని చూపుతూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని ఎన్నికల అధికారిని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. అయితే మున్సిపల్ యాక్ట్‌లో సీక్రెట్ ఓటింగ్ జరపాలని లేదని, చేతులెత్తి ఛైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియనే చేపట్టాలని టీడీపీ సభ్యులు కోరారు.
పూర్వపరాలు ఇవీ..
కొండపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నప్పటికీ వారి బలం 15కే పరిమితం అయింది. టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర సభ్యురాలి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎక్స్ అఫిషియోగా ఎంపీ కేశినేని నానీకి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడుతూ వచ్చి ఇవాళ్టితో ఫుల్‌స్టాప్ పడింది. మంగళవారం రోజు ఈ ఎన్నిక విషయంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వైసీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివనారాయణరెడ్డి ప్రమాణస్వీకార ప్రక్రియను ప్రారంభించకుండానే ఎన్నికను వాయిదా వేశారు. కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ఎందుకు వాయిదా వేస్తున్నారో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎక్స్‌అఫిషియో సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) రిటర్నింగ్ అధికారిని కోరగా.. ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో ఆరు గంటల వరకు వేచి చూసి, టీడీపీ సభ్యులతో కలిసి కేశినేని బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. టీడీపీ గెలిచి నిలిచింది.