కోట్లాది రుపాయల ట్రాఫిక్ చలాన్ల సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించుకున్న వ్యవహారంలో మాజీ డీజీపీ అల్లుడిపై కేసు నమోదైంది. ఏపీలో సంచలనం సృష్టించిన వ్యవహారంలో పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో కేసు వివరాలను బయట పెట్టారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.ఏపీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులు పోలీసు శాఖకు చెల్లించిన జరిమానాలను దారి మళ్లించిన కేసులో మాజీ డీజీపీ అల్లుడుతో పాటు పలువురిపై గుంటూరు జిల్లా తాడేపల్లిలో కేసు నమోదైంది. ఈ కేసులో కీలక సూత్రధారి కొమ్మిరెడ్డి అవినాశ్ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు.ఏపీ పోలీసుశాఖను మోసం చేసి రూ.40 కోట్ల రుపాయలు దోచుకున్న మాజీ డీజీపీ అల్లుడి వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో నిందితులపై కేసు నమోదు చేశారు. ఏకంగా పోలీసులకే బురిడీ కొట్టించిన వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు మౌనం వహించడంపై విమర్శలు వచ్చాయి. చిన్నాచితక కేసులకు హడావుడి చేసే పోలీసులు కోట్లాది రుపాయలు దోచుకున్న ఘటనలో మౌనం వహించడంపై సందేహాలు తలెత్తాయి.
ఈ వ్యవహారంపై మీనమేషాలు లెక్కించిన పోలీసులు చివరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డేటా ఎవాల్వ్ సంస్థతో పాటు దాని సీఈవో కొమ్మిరెడ్డి అవినాశ్, కొత్తపల్లి రాజశేఖర్, మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు.నిందితులపై ఐపీసీ 409 నేరపూరిత విశ్వాసఘాతుకం, ఐపీసీ 420 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద వీరిపై అభియోగాలు మోపారు.ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల మోసం కొన్ని నెలలుగా పోలీసుశాఖలో అంతర్గతంగా దర్యాప్తు జరుగుతోంది. సెప్టెంబర్ నెలలోనే కేసు నమోదైనా.. బయటకు రానీయకుండా తొక్కిపెట్టారు.తాడేపల్లిలో కేసు నమోదైన తర్వాత కేసు వివరాలను ఐజీ పాలరాజు అధికారికంగా ప్రకటించారు. ఈ చలానా కుంభకోణంలో రూ.36.52 కోట్లు దుర్వినియోగం అయినట్టు చెప్పారు. కొమ్మిరెడ్డి అవినాష్‍కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు మళ్లించినట్లు గుర్తించామన్నారు.పీఈ ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు జమ కాలేదన్నారు. నాలుగేళ్లకు పైగా నగదు దారి మళ్లిస్తున్నట్లు చెప్ాపరు.
నిధుల మళ్లింపు విషయాన్ని సెప్టెంబర్‍లో తిరుపతి యూనిట్‍లో గుర్తించామని, డేటా సొల్యూషన్స్ నిర్వాహకుడు అవినాష్‍ను సంజాయిషీ అడిగామని చెప్పారు.నిధుల దుర్వినియోగంపై అవినాష్‍ను సంజాయిషీ కోరామని, డేటా సొల్యూషన్స్ ప్రతినిధి రాజశేఖర్‍ను ప్రశ్నించినా సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని వివరించారు. దీంతో రాజశేఖర్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపామన్నారు. విచారణలో నిధులు దుర్వినియోగం చేసినట్లు అంగీకారించారని, అవినిష్ ఆస్తుల విషయమై సబ్ రిజిస్ట్రార్‍కు లేఖలు రాసినట్లు చెప్పారు.ఆస్తుల క్రయవిక్రయాలకు తావులేకుండా సబ్ రిజిస్ట్రార్‍కు లేఖలు రాశామని, త్వరలోనే నిందితుడు అవినాష్‍ను పట్టుకుంటామని, కొమ్మిరెడ్డి అవినాష్ మాజీ డీజీపీకి బంధువని ఐజీ పాలరాజు చెప్పారు.మరోవైపు నాలుగున్నేరుళ్లుగా ట్రాఫిక్ చలాన్ల సొమ్ము పోలీసు ఖాతాలకు జమ కాకపోయినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు శాఖలోని సాంకేతిక విభాగాల్లో ఉన్న అధికారులకు కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
మాజీ డీజీపీతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టు వదిలేశారని చెబుతున్నారు. పేమెంట్ గేట్‌వేల నుంచి వసూలైన సొమ్మును నిర్దిష్ట వ్యవధిలోగా ప్రభుత్వ ఖాతాలకు చెల్లించకపోయినా ఏళ్ల తరబడి ఎందుకు కళ్లు మూసుకున్నారనే సందేహాలు ఉన్నాయి. ఈ అక్రమంలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల ప్రమేయం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయిఈ చలాన్ల టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన అధికారులతో పాటు ఈ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులను కూడా ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. నిందితుల్ని కాపాడేందుకు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు మాజీ డీజపీ అధికార పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని ఇప్పటికే ముందుకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.