ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వెస్ తెలిపారు. మానిటరింగ్, టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతున్నదని, దేశంలో మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ సరికొత్త కరోనా వేరియంట్ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. కెనడా కూడా ఆఫ్రికాలోని ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. అయితే ఈ జాబితాలో నైజీరియా లేకపోవడం గమనార్హం.