కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో విదేశీ సందర్శకుల రాకను నిషేధిస్తూ జపాన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రధాని ఫుమియో కిషిద వెల్లడించారు. విదేశీ విద్యార్ధులు, కార్మికులు, స్వల్పకాలిక వాణిజ్య సందర్శకుల కోసం ఈ నెల ప్రధమార్ధంలో సరిహద్దు నియంత్రణలను సడలించిన జపాన్ తాజాగా సరిహద్దు నియంత్రణలను పునరుద్ధరించింది.
ఈ వారాంతంలో దక్షిణాఫ్రికా సహా ఎనిమిది ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వ కేంద్రాల్లో పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నియంత్రణలు విధించింది. మరోవైపు ఒమిక్రాన్ కట్టడికి పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించడాన్ని డబ్ల్యూహెచ్ఓ తప్పుపట్టింది. శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని, నూతన వేరియంట్ గురించి పూర్తి వివరాలను మదింపు చేసేందుకు సమయం పడుతుందని పేర్కొంది.