ప్రధాని మోడీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్‌సీఏ) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరం కార్యక్రమంలో వర్చువల్ విధానంలో శుక్రవారం పాల్గొని, మాట్లాడారు. ప్రతి పౌరుడు ఆర్థిక సాధికారత సాధించడానికి ఫిన్‌టెక్ విప్లవం రావాలని మోడీ పిలుపునిచ్చారు. ఆర్థికపరంగా అందరినీ కలుపుకొనిపోవడం ఈ విప్లవానికి చోదక శక్తి అని చెప్పారు. భారతీయ డిజిటల్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్ల ఈ రంగంలో మన దేశం చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందన్నారు. ఇన్‌కమ్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ అనే నాలుగు స్తంభాలపై ఫిన్‌టెక్ ఆధారపడిందని తెలిపారు
ఆదాయం వృద్ధి చెందితే, పెట్టుబడులు పెట్టడం సాధ్యమవుతుందని, బీమా కవరేజి వల్ల రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ వల్ల విస్తరణలకు రెక్కలు వస్తాయన్నారు. ఈ నాలుగు స్తంభాలపై భారత దేశం పని చేస్తోందన్నారు. ఫిన్‌టెక్ విజయానికి ఆధారం దాని సమ్మిళితత్వం, ఉమ్మడి శ్రేయస్సేనని తెలిపారు. విస్తృత వేదిక ఫిన్‌టెక్ ఇన్నోవేషన్స్‌కు కచ్చితమైన స్ప్రింగ్‌బోర్డు అవుతుందని చెప్పారు. భారత దేశంలోని ఫిన్‌టెక్ ఇండస్ట్రీ దేశంలోని ప్రతి వ్యక్తికీ చేరువయ్యేందుకు వినూత్న అవకాశాలను కనుగొంటున్నట్లు తెలిపారు. ఫిన్‌టెక్ చొరవను ఫిన్‌టెక్ విప్లవంగా మార్చవలసిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఆర్థిక సాధికారతను సాధించడానికి దోహదపడే విధంగా ఈ విప్లవం ఉండాలన్నారు.
తన ప్రభుత్వం ఫిన్‌టెక్ ద్వారా ప్రజలను సాధికారులను చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. గడచిన ఏడేళ్ళలో దాదాపు 430 మిలియన్ల జన్ ధన్ ఖాతాలతో బ్యాంకింగ్ వ్యవస్థ సార్వజనీనమైందన్నారు. ఇప్పటి వరకు 690 మిలియన్ల రూపే కార్డులు జారీ అయ్యాయని, గత ఏడాది వీటి ద్వారా 1.3 బిలియన్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. దేశీయంగా అభివృద్ధిపరచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) గత నెలలో 4.2 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసిందని చెప్పారు.