తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని పరిపాలన విభాగపు అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం బస్ డే గా పాటించి, ఆ రోజు టీయస్ఆర్టీసీ బస్ లలోనే ప్రయాణించాలని టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.సీ.సజ్జనార్, ఐ.పి.యస్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తాను స్వయంగా తన నివాస గృహం నుండి లక్డీకపూల్ మీదుగా టెలిఫోన్ భవన్ వరకు కాలినడకన వచ్చి టెలిఫోన్ భవన్ బస్టాప్ లో మెహిదీపట్నం డిపోకు చెందిన 113/ఐ/యం బస్సులో టికెట్ కొనుక్కొని తాను పనిచేస్తున్న కార్యాలయానికి (బస్ భవన్ ) ప్రయాణం చేశారు. తానెవరో తెలుపకుండా టెలిఫోన్ భవన్ బస్టాప్ లో తనతో పాటు అక్కడ ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు.
ముఖ్యంగా బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, పనితీరు, బస్సుల్లో శుభ్రత, సౌకర్యాలు, కార్గో సేవల గురించి వారి అభిప్రాయాలూ స్వయంగా తెలుసుకున్నారు. అలాగే ప్రయాణీకులు, విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ప్రత్యక్షంగా స్వీకరించారు. తాను పనిచేస్తున్న కార్యాలయానికి చేరుకున్న తరువాత బస్ డ్రైవర్, కండక్టర్ ను అభినందిస్తూ వారు స్టేజీల వద్ద రూటు వివరాలు గట్టిగా అరచి చెప్పడం, అలాగే డ్రైవర్ చక్కగా బస్ ను నడిపి సురక్షితంగా సౌకర్యవంతంగా తన ప్రయాణం సాగడానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బస్ ప్రయాణం సురక్షితమని, సౌకర్యవంతమని, చౌకైనదని, అలాగే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సంస్థ అభ్యున్నతికి తమవంతు సహకారం అందించాలని ప్రజలకు, ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సంస్థ మనుగడకు ప్రయాణికుల ఆదరణ ముఖ్యమని సంస్థ అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం బస్ డే పాటించి బస్సులోనే ప్రయాణించడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలూ, అవసరాలు, వారికి కావలసిన సేవల గురించి తెలుసుకొనే వీలు కలుగుతుందని, తద్వారా తగిన చర్యలు చేపట్టి సంస్థను అభివృద్ది పథంలో నడిపించాలనే ఉద్దేశంతో సంస్థ ఎండీ సజ్జనార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.