విద్యార్థులకు మెనూ సరిగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మోడల్ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో రాజీ పడబోమన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ముందుకు వెళ్తుందన్నారు. నాడు నేడుకు ప్రత్యేకంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని క్యాబినేట్ హోదా కల్పించి జగన్ సర్కార్ నియమించిందన్నారు.
కాగా, జగన్ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పించిందని, ఇదే కాకుండా జగనన్న విద్యాదీవెన పేరుతో పేద విద్యార్థులకు నగదును సైతం అందజేస్తుందన్నారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా ఖాజీపేట పాఠశాలల్లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.