అంతర్జాతీయం

దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌.. ఒమిక్రానేనా?

దక్షిణాఫ్రికా (South Africa) అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు (Cyril Ramaphosa) కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నవేళ స్వయంగా ఆ దేశాధ్యక్షుడికి కరోనా సోకడం గమనార్హం.

రామఫోసో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. అయితే ఆదివారం ఆయన స్వల్ప అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేప్​టౌన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

రామపోసో ఇటీవలే నైజీరియా వెళ్లివచ్చారని, డిసెంబర్‌ 8న సెనెగల్‌ నుంచి వచ్చిన తర్వాత పరీక్షలు చేయగా ఆయనకు నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. కాగా, దక్షిణాఫ్రికాలో నిన్న ఒక్కరోజే 17,154 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7861 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి.