- పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్య
ఇద్దరు వ్యక్తులు కొద్ది రోజుల పాటు కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని సహజీవనంగా పరిగణించలేమని పంజాబ్, హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. కలసి ఉన్నంత కాలం ఒకరిపై ఒకరికి బాధ్యత కలిగి ఉండి, మనస్ఫూర్తిగా జీవిస్తే దాన్ని వివాహం వంటి సహజీవనంగా పరిగణించవచ్చని జస్టిస్ మనోజ్ బజాజ్ పేర్కొన్నారు. యువతి కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హర్యానాలోని యమునానగర్ జిల్లాలో జీవిస్తున్న ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. అయితే వీరి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిపై నవంబర్‌లో విచారణ జరిపిన కోర్టు.. ఈ జంటకు 25 వేల జరిమానా కూడా విధించింది. ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఆ యువతి (18 ఏండ్లు), యువకుడు (20 ఏండ్లు) కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు యువతికి వేరే అబ్బాయితో పెండ్లి జరిపించాలని చూడగా, ఆమె ఇంటి నుంచి పారిపోయి వచ్చి ప్రేమించిన అబ్బాయితో కలసి నివసిస్తున్నది.