- పాక్‌పై విజయానికి 50 ఏండ్లు పూర్తి
- జవాన్ల త్యాగాలను స్మరించుకొన్న దేశం
- యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
- బంగ్లా విజయోత్సవాల్లో కోవింద్
- పరేడ్‌లో పాల్గొన్న భారత సైన్యం
- ఆ యుద్ధం సువర్ణాధ్యాయం: రాజ్‌నాథ్
పాకిస్థాన్‌పై భారత్ విజయానికి, బంగ్లాదేశ్ అవతరణకు గురువారంతో 50 ఏండ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహించింది. ‘స్వర్ణిమ్ విజయ్ దివస్’ పేరుతో వేడుకలు నిర్వహించింది. నాటి యుద్ధం లో సైనికుల త్యాగాలను, పోరాట వీరులను దేశం గుర్తు చేసుకొన్నది. అమరులైనవారికి ప్రజలు నివాళులు అర్పించారు. మరోవైపు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం బంగ్లాదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. విజయోత్సవ పరేడ్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న విదేశాధినేత కోవింద్ ఒక్కరే కావడం గమనార్హం. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమకారులు, భారత సాయుధ బలగాల త్యాగాలను ప్రధాని మోదీ గుర్తు చేసుకొన్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం దగ్గర అమరులకు నివాళులు అర్పించారు. గతేడాది విజయ్ దివస్ రోజు వెలిగించిన నాలుగు కాగడాలను యుద్ధ స్మారకం దగ్గర ఉన్న దివిటీలో వేశారు. ఈ కాగడాలను ఏడాదిపాటు యుద్ధంలో పాల్గొన్న సైనికుల గ్రామాల్లో ప్రదర్శించారు. 1971కి ముందు పాకిస్థాన్‌లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్థాన్ నుంచి విముక్తి కోసం ఉద్యమించింది. దీనికి భారత్ మద్దతునిచ్చింది. ఈ క్రమంలో భారత సైన్యం పాక్‌తో యుద్ధం చేసి విజయం సాధించింది. 1971 డిసెంబర్ 16న భారత సైన్యం, బంగ్లాదేశ్ ముక్తిబాహిని ఎదుట 93 వేల మంది పాక్ సైనికులు లొంగిపోయారు. ఫలితంగా బంగ్లాదేశ్ అవతరించింది. దీనికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16ను విజయ్‌దివస్‌గా జరుపుతున్నారు. ఈ యుద్ధం లో 2,500 మంది భారత సైనికులు అమరులయ్యారు.
గర్వంగా ఉంది
విజయ్ దివస్ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ 1971 నాటి మిగ్-21 యుద్ధ విమానం నమూనాను బంగ్లాదేశ్ రాష్ట్రపతి అబ్దుల్ హమీద్‌కు బహుమానంగా ఇచ్చారు. బాపూ బంగబంధు డిజిటల్ ఎగ్జిబిషన్‌ను కూడా కోవింద్ బహుమతిగా ఇచ్చారు. 1971 ఇండో-పాక్ యుద్ధం భారత సైన్యం చరిత్రలో సువర్ణాధ్యాయం అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
పార్లమెంట్ నివాళి
బంగ్లాదేశ్ విముక్తి పోరాట యోధులు, భారత సైన్యానికి పార్లమెంటు గురువారం ఘనంగా నివాళి అర్పించింది. స్వర్ణిమ్ విజయ్ దివస్ వేడుకలను కోల్‌కతాలోని భారత ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ సైనికులు, అమరుల కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు. పాక్‌పై యుద్ధంలో గెలుపునకు గుర్తుగా జమ్ములోని ఉధమ్‌పూర్ మిలిటరీ స్టేషన్‌లో నిర్మించిన స్వర్ణిమ్ విజయ్ ద్వారాన్ని యుద్ధ వీరులకు అంకితం ఇస్తున్నట్టు భారత ఆర్మీ ఉత్తర కమాండ్ ప్రకటించింది.
పరేడ్‌లో భారత సైన్యం
బంగ్లాదేశ్ విజయోత్సవ పరేడ్‌లో భారతదేశ త్రివిధ దళాల నుంచి 122 మంది సైనికులతో కూడిన బృందం కూడా పాల్గొన్నది. వింగ్ కమాండర్ ఆశా జ్యోతిర్మయి బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన సైనికులతో కలిసి స్కైడైవింగ్ విన్యాసాలు చేశారు. భారత సైనికులకు నివాళులు అర్పించారు. ఇండియాతో పాటు రష్యా, భూటాన్‌కు చెందిన సైనికుల బృందాలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. విదేశాలకు చెందిన సైనిక బృందాలు బంగ్లాదేశ్ విజయోత్సవ పరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.