- అమ్మాయిల కనీస వివాహ వయసు మూడేండ్లు పెంపు
- అబ్బాయిలతో సమానంగా 21 ఏండ్లకే అమ్మాయిల పెండ్లి
- కీలక ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం!
- శీతాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకురానున్న కేంద్రం
దేశంలో అమ్మాయిల చట్టబద్ధమైన కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించినట్టు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బాల్యవివాహాల నిరోధక చట్టం, 2006కు సవరణలు చేసేలా బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దేశంలోని అమ్మాయిలందరికీ ఒకే కనీస వివాహ వయసు ఉండేలా ఆయా సంఘాల వ్యక్తిగత చట్టాలను మార్చే లా బిల్లులో పలు ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం దేశంలో అబ్బాయిలకు చట్టబద్ధమైన కనీస వివాహ వయసు 21 ఏండ్లు కాగా అమ్మాయిలకు 18 ఏండ్లు. ఇద్దరి కనీస వివాహ వయసులో అంతరాన్ని చెరిపేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివాహానికి కనీస వయసు ఉండాల్సిన అవసరమేంటి?
బాల్య వివాహాలు, మైనర్లపై వేధింపులను తగ్గించడానికి కనీస వివాహ వయసు నిబంధన తెచ్చారు. హిందువుల కోసం 1955లో హిందూ వివాహ చట్టా న్ని తెచ్చారు. దీనిప్రకారం అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 ఏండ్లు కాగా, అబ్బాయిలకు 21 ఏండ్లు. ప్రత్యేక వివాహ చట్టం-1955, బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 కూడా ఈ నిబంధనలనే సూచిస్తున్నాయి. యుక్తవయసు వచ్చిన వారికి పెండ్లి చేయొచ్చనే ప్రత్యేక నిబంధనలను ముస్లింలు పాటిస్తున్నారు. వివిధ మత సంఘాలు వివాహ వయసుపై ప్రత్యేక నియమాలను పాటిస్తున్నాయి.
ఇప్పుడెందుకు సవరిస్తున్నారు?
చిన్న వయసులోనే పెండ్లి కావడంతో తక్కువ వయసులోనే గర్భం దాల్చడం వల్ల తల్లి, బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మాతా-శిశు మరణాలు పెరుగుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటంతో వారి కెరీర్‌కు అవరోధంగా మారింది. లింగ సమానత్వానికి ఈ నిబంధన గొడ్డలిపెట్టుగా మారుతున్నది. అమ్మాయిలకు 21 ఏండ్లకు పెండ్లి చేస్తే యువతి కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం ఉంటుందని పలువురి అభిప్రాయం.
నిబంధనలు మార్చాలని ఎవరు సూచించారు?
అమ్మాయిల కనీస వివాహ వయసులో సవరణలు అవసరమా? లేదా? అని నిర్ణయించడానికి గతేడాది జూన్‌లో కేంద్రం జయ జైట్లీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయ జైట్లీ నేతృత్వం వహించగా.. నీతిఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ శాఖ కార్యదర్శులు, సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. దేశంలోని 16 విశ్వవిద్యాలయాలు, వేలాది కాలేజీలు, స్కూళ్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, మతసంఘాలు, అట్టడుగు వర్గాల వారిపై ఈ సర్వే జరిపి గత డిసెంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచాల్సిన అవసరమున్నదని కమిటీ అభిప్రాయపడింది.
వయసు పెంపును అందరూ ఆహ్వానిస్తారా?
ఐదారు దశాబ్దాలుగా ఉన్న చట్టాన్ని మార్చితే వ్యతిరేకత రావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కనీస వివాహ వయసును పెంచడానికి కారణాలు, పెంపుతో కలుగబోయే ప్రయోజనాలను ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయాలని కమిటీ సూచించింది.
కమిటీ చేసిన ప్రతిపాదనలేమిటి?
- అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏండ్లకు పెంచడం
- తొలిసారి గర్భం దాల్చేనాటికి ఆమ్మాయిల వయసు 21 ఏండ్లు దాటాలి
- పాఠశాల, కళాశాల విద్య అందేలా చూడటం
- రవాణా సదుపాయాలు మెరుగుపర్చడం
- వ్యాపార సామర్థ్యం, సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించడం
రెండు అంశాలపై దృష్టిసారించాం
‘అమ్మాయిల వివాహ వయసును అబ్బాయిలకు సమానంగా సరిచేస్తేనే లింగసమానత్వానికి అర్థం. 18 ఏండ్లకే పెండ్లి కావడంతో ఉన్నతవిద్య కొనసాగించలేక, ఆర్థిక స్వావలంబన సాధించలేక అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులో పెండ్లి శారీరకంగా, మానసికంగా అమ్మాయిలకు తీరని నష్టాన్ని కలుగజేస్తున్నది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొనే సవరణలు చేశాం’
–జయ జైట్లీ, కమిటీ సారథి