జాతీయం ముఖ్యాంశాలు

అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం

ఒడిశాలోని కలాం దీవి నుంచి అగ్ని-పి ప్రయోగం

భారత అమ్ములపొదిలో చేరేందుకు మరో పదునైన అస్త్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) నేడు అత్యాధునిక అగ్ని-పి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-పి (అగ్ని-ప్రైమ్) మిస్సైల్ ను నెక్ట్స్ జనరేషన్ క్షిపణిగా డీఆర్డీవో చెబుతోంది. అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సత్తా దీని సొంతం. దీని రేంజి 1000 నుంచి 2000 కిలోమీటర్లు. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ఉదయం 11.06 గంటలకు గాల్లోకి దూసుకుపోయిన అగ్ని-పి పరీక్ష పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.

తూర్పు తీర ప్రాంతం పొడవునా ఏర్పాటు చేసిన వివిధ టెలీమెట్రీ వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రోల ఆప్టికల్ కేంద్రాలు, యుద్ధ నౌకల సాయంతో ఈ మిసైల్ గమనాన్ని డీఆర్డీవో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఇందులోని కీలక వ్యవస్థల పనితీరు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. అగ్ని-పి రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. దీంట్లో డ్యూయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు పొందుపరిచారు. తాజా పరీక్ష ద్వారా ఇందులోని సాంకేతిక వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. అగ్ని-పి పరీక్ష విజయవంతం కావడంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలను దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.