తెలంగాణ ముఖ్యాంశాలు

అరుణారెడ్డి స్వర్ణ సంబురం

  • ఈజిప్టు టోర్నీలో రెండు పసిడి పతకాలు

ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరిగిన హార్హోస్‌ కప్‌ అంతర్జాతీయ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నీలో రాష్ట్ర యువ జిమ్నాస్ట్‌ అరుణారెడ్డి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల ఫ్లోర్‌, వాల్ట్‌ ఈవెంట్లలో అద్వితీయ ప్రదర్శనతో అరుణ పసిడి పతకాలు కొల్లగొట్టింది. 2018లో మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పతకం (కాంస్యం) సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా చరిత్ర లిఖించిన అరుణ.. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నది. 2019లో కుడికాలుకు శస్త్రచికిత్స తర్వాత ఇటీవలే పూర్తిగా కోలుకున్న ఈ స్టార్‌ జిమ్నాస్ట్‌ అద్భుతంగా పుంజుకుంది. ఈజిప్టు టోర్నీకి ముందు ఢిల్లీలో మనోజ్‌ రాణా దగ్గర శిక్షణ తీసుకున్న అరుణ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగి పసిడి పతకాలను ముద్దాడింది.