రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. ఒకేసారి రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగత్రలు గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి.
సాయంత్రమైందంటే గాలుల తీవ్రత పెరుగుతున్నది. ఇదిలా ఉండగా.. చలి తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే బేలా, సిర్పూర్ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వాంకిడిలో 4.9, జైనథ్‌లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్‌హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్ డీపీఎస్ పేర్కొంది. చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.