టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ఫలితాలకు పొత్తులకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పొత్తులపై వైస్సార్సీపీ నేతలు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తమ పార్టీ గతంలో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని గెలిచిందని, పొత్తులు లేకుండా కూడా గెలిచిందని ఆయన తెలిపారు.
ఒక్కోసారి పొత్తులు పెట్టుకున్నప్పటికీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతంలో ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సీఎం జగన్ ఏపీని సర్వనాశనం చేశారని ఆయన అన్నారు. జగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మ పోరాటం చేయాలని ఆయన అన్నారు. ఇందుకుప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.