ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు

విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మ హత్య చేసుకోవడం విషాదం లో పడేసింది. నిజామాబాద్‌ కు చెందిన తల్లి పప్పుల శ్రీలత(54) , కుమారుడు ఆశిష్‌(22) అతిగా ఇన్సులిన్ ఇంజెక్ట్​ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి పప్పుల సురేష్‌(56), మరో కుమారుడు పప్పుల అఖిల్‌(28) కృష్ణా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

నిజామాబాద్‌ నుంచి పప్పుల సురేష్‌ కుటుంబం ఈ నెల 06 న దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌లో ఉన్న కన్యకాపరమేశ్వరి హోటల్ లో పప్పుల అఖిల్‌ పేరుతో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున 2.30గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువులకు మెసేజ్‌ పెట్టారు. బంధువులు స్పందించి వెంటనే హోటల్ నిర్వాహకులకు ఫోన్‌ చేశారు. హోటల్ సిబ్బంది, నిర్వాహకులు ఈ కుటుంబం ఉన్న రూమ్‌కు వెళ్లి చూడగా.. తల్లీ కుమారుడు విగతజీవులుగా కనిపించారు. సూసైడ్ చేసుకున్న గదిలో 20 వరకు ఇన్సులిన్ బాటిల్స్, సిరంజీలను పోలీసులు గుర్తించారు. శరీరంలోకి ఇన్సులిన్ బాటిల్స్ 20 వరకు ఇంజెక్టు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు చనిపోవడానికి కారణం అప్పులే అని అనుమానిస్తున్నారు.