ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

ఈరోజు నుండి తెలంగాణలో బూస్టర్ డోస్ ప్రారంభం

మరోసారి దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన ఓమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఉచితంగా ప్రికాషన్‌ డోసులు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలో హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా ప్రికాషన్ డోస్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వీరితో పాటు 60 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బూస్టర్‌ డోస్ ఇవ్వనున్నారు. మొదటి, రెండో డోస్ తీసుకున్న వాక్సిన్ నే మూడో డోస్ గా తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు.

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్‌ డోస్ కోసం మళ్లీ కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ప్రికాషనరీ డోస్‌ టీకా షెడ్యూల్స్‌ ఇప్పటికే ఓపెన్‌ అయ్యాయి. నిన్నటి నుంచే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక ఈరోజు నుంచి నేరుగా వ్యాక్సినేషన్‌ సెంటర్‌‌కు వెళ్లి కూడా అపాయింట్‌మెంట్ బుక్‌ చేసుకోవచ్చు. అలాగే రెండు డోస్‌ల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకుని ఉంటే.. ప్రికాషన్‌ డోసు కూడా కోవిషీల్డ్‌నే అందిస్తారు. ఒకవేళ కోవాగ్జిన్ తీసుకుని ఉంటే అదే ఇస్తారు.