ఫిబ్రవరి లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేసి , అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీలో చేరారు. ‘సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే స్వామి ప్రసాద్ సహా ఆయన కార్యకర్తలు, మద్దతుదార్లను ఎస్పీలోకి ఆహ్వానిస్తున్నాను. స్వామి ప్రసాద్‌ను ఈనెల 22న మా పార్టీలోకి చేర్చుకుంటాము.’ అని అఖిలేశ్ ట్వీట్ చేశారు.
దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నతరహా పరిశ్రమలపై యూపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేసినట్టు మౌర్య తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరో అదనపు సీటు కావాలని మౌర్య డిమాండ్ చేశారని, అందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతోనే ఆయన రాజీనామా చేశారని మరికొంతమంది అంటున్నారు.