జాతీయం

యూపీ ఎన్నికల్లో మాయావతి పోటీ చేయడం లేదు : స‌తీశ్ చంద్ర మిశ్రా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇటీవ‌లే షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. ఈ క్ర‌మంలో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ నేత‌లు కీల‌క విష‌యం వెల్ల‌డించారు. బ‌హుజ‌న్ స‌మాజ్ చీఫ్ మాయావ‌తి.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉత్త‌ర‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యులు స‌తీశ్ చంద్ర మిశ్రా తెలిపారు. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఈ విష‌యం వెల్ల‌డించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. ఆమెతో పాటు తాను కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ఎంపీ స‌తీశ్ చంద్ర మిశ్రా స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ కానీ, బీజేపీ పార్టీలు గానీ గెల‌వ‌బోవ‌ని అన్నారు. స‌మాజ్‌వాదీ పార్టీకి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులే లేర‌ని అన్నారు. స‌మాజ్ వాదీ పార్టీ వ‌ద్ద 400 మంది అభ్య‌ర్థులు లేరు, అలాంట‌ప్పుడు వాళ్లు ఎలా 400 సీట్లు గెలుస్తారంటూ ఎంపీ స‌తీశ్ చంద్ర ప్ర‌శ్నించారు. త్వ‌ర‌లో జ‌రిగే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీ గానీ, బీజేపీ గానీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేవ‌ని అన్నారు.

కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్,ఉత్త‌రాఖండ్,గోవా,పంజాబ్,మ‌ణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ని ప్ర‌క‌టించారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ గ‌డువు మే నెల‌తో ముగియ‌నుండ‌గా మొత్తం 400కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. ఈ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఈ విష‌యంలో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ కాస్త వెనుక‌బ‌డిన‌ట్టు క‌నిపిస్తోంది.