తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న కేసినో వ్యవహారం
ఏపీ మంత్రి కొడాలి నానికి టీడీపీ నేతలకు మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా బుద్ధా వెంకన్న మరోసారి కొడాలి నానిపై ధ్వజమెత్తారు. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. జగన్ దగ్గర మార్కులు కొట్టేసేందుకే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొడాలి నాని భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు గురించి కొడాలి నాని మాట్లాడితే… తాను కూడా అదే స్థాయిలో మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొడాలి నాని మాట్లాడడం మానేస్తే తాము కూడా మాట్లాడబోమని స్పష్టం చేశారు.
గుడివాడ ఏమైనా పాకిస్థానా? ఎవరూ గుడివాడ వెళ్లకూడదా? అంటూ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడకు ఇతర పార్టీల నేతలు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మొన్న టీడీపీ వాళ్లు వెళితే ఆపారు… ఇవాళ బీజేపీ వాళ్లను అడ్డుకున్నారని ఆరోపించారు. తనపై కేసు నమోదు చేసి విచారించినట్టే కొడాలి నానిపైనా కేసు నమోదు చేసి విచారించాలని బుద్ధా డిమాండ్ చేశారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలన్నారు.