రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10 నుంచి అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. పాలకులు వారి వైఫల్యాలను రాజ్యాంగంపై ఆపాదించడం సరికాదని అన్నారు. నియంతృత్వ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ కు దళితులపై గౌరవం లేదని మంద కృష్ణ అన్నారు. ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని ఇంకా ఎన్ని రోజులు అనుసరించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని… ఆ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ వల్లే తాను సీఎం అయ్యాననే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోందని… రాజ్యాంగం ప్రకారం తనపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉందనే, రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారని దుయ్యబట్టారు.