ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భార్య, రి సోల్ జు చాలా అరుదుగా బయట కనిపిస్తారు. సుమారు ఐదు నెలల తర్వాత ఆమె మరోసారి అందరి కంటపడ్డారు. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని మన్సుడే ఆర్ట్ థియేటర్‌లో జరిగిన ఒక కళా ప్రదర్శనకు కిమ్ జోంగ్ ఉన్ తన భార్య, అత్తతో కలిసి హాజరయ్యారు. థియేటర్ ఆడిటోరియంలోకి కిమ్ దంపతులు ఎంట్రీ ఇవ్వగానే వారికి ఘన స్వాగతం పలికారు. కిమ్‌తో పాటు ఆయన భార్య రి సోల్ జును చూసిన ప్రేక్షకులు ‘హుర్రే.. హుర్రే’ అంటూ హోరెత్తించారు. ఆమె సంప్రదాయ ఎరుపు, నలుపు రంగు హాన్‌బాక్ దుస్తులు ధరించారు. షో సమయంలో కిమ్‌తో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. కిమ్ దంపతులు షోలో కళాకారులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోపాటు వారితో కలిసి ఫోటోలు దిగారు.
కాగా, కిమ్ భార్య రి సోల్ జు చివరిసారిగా సెప్టెంబర్ 9న బయట ప్రపంచానికి కనిపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఆ దేశ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా దివంగత తాత, తండ్రి ఎంబాల్డ్ మృతదేహాలను ఉంచే కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్‌ని సందర్శించడానికి భర్త కిమ్‌తో కలిసి ఆమె వెళ్లారు. దీనికి ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ఉత్తర కొరియాను సందర్శించినప్పుడు భర్త కిమ్‌తో కలిసి రి సోల్ జు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి దగ్గరుండి వీడ్కోలు పలికారు. ఆ తరువాత ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో కిమ్ భార్య అనారోగ్యానికి గురై ఉంటారని లేదా గర్భందాల్చి ఉంటారంటూ వదంతులు వెలువడ్డాయి.