ఈ నెల 6 వరకు చైనాలోనే ఉంటానన్న ఇమ్రాన్
చైనాలో రేపు వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నాయి. అయితే, ఈ వేడుకలకు తాము వెళ్లబోమని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ప్రకటించారు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో ఆయా దేశాల అధినేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం తాను చైనాకు వెళ్తానని ప్రకటించారు. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు తాను హాజరవుతానని, నేడు చైనాకు వెళ్తానని తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు తాను చైనాలో పర్యటిస్తానని చెప్పారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో పాటు ప్రధాని లి కెక్వియాంగ్‌తో సమావేశమవుతానని తెలిపారు. కాగా, వింటర్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చైనా అధ్యక్షుడితో పాటు ప్రభుత్వ పెద్దలు పాల్గొంటారు. అలాగే, చైనా మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే, పలు దేశాలకు చెందిన 32 మంది నాయకులు ఈ వేడుకల్లో పాల్గొంటారని చైనా ప్రకటించింది.