తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తారు: మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నేడు బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించారు. రూ. 120 కోట్ల వ్య‌యంతో నిర్మించే సిద్ధాపూర్ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం సిద్దాపూర్ గ్రామంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌ను ప్ర‌జ‌లుగా చూస్తుంద‌ని కేటీఆర్ అన్నారు. మ‌తం ఏదైతేనేమి.. ర‌క్తం ఒక్క‌టే క‌దా? బీజేపీ నాయ‌కులు ముస్లింల మీద విషం చిమ్మ‌డం ప‌నిగా పెట్టుకున్నారు. తెల్లారిలేస్తే విషం నింపుడు, ద్వేష ప్ర‌చారం చేస్తున్నారు. మ‌న‌సు, శ‌రీరం నిండా విషం త‌ప్ప‌, విష‌యం లేదు. ఏడున్న‌రేండ్ల‌లో మోడీ తెలంగాణ‌కు ఏం ఇవ్వ‌లేదు. 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరైతే.. తెలంగాణ‌కు గుండు సున్నా. 87న‌వోద‌య పాఠ‌శాల‌లు మంజూరు చేస్తే.. తెలంగాణ‌కు గుండు సున్నా. కొత్తగా 8 ఐఐఎంలు మంజూరైతే తెలంగాణ‌కు గుండు సున్నా. 16 ఐసెర్‌లో ఇస్తే రాష్ట్రానికి ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేదు. ఇందుకేనా మా కార్ల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు అడ్డం వ‌చ్చేది. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మెడిక‌ల్ కాలేజీలు, గురుకుల పాఠ‌శాల‌లు మంజూరు చేశాం. ఆగ‌మాగం అవొద్దు.. ఆలోచ‌న‌తో ఉండండి. తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాల‌ని బీజేపీ నాయ‌కుల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను మోడీ అమ్మేస్తుండు.. మీరు ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తడు. మ‌మ్మ‌ల్ని కూడా అమ్మేస్తాడు. బీజేపీ నాయ‌కుల లొల్లికి పొర‌పాటున యువ‌త ఆగ‌మైతే మ‌ళ్లీ తెలంగాణ‌ను, ఆంధ్రాను క‌లుపుత‌రు ఈ పుణ్యాత్ములు. అంత దారుణ‌మైన మ‌న‌షులు వీళ్లు. కేంద్రం స‌హ‌క‌రించినా, స‌హ‌క‌రించ‌క‌పోయినా తెలంగాణ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని కేటీఆర్ అన్నారు.