రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఉద్యోగుల విభజన
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాలు ఏర్పడనున్నాయి. అరకు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా రెండు జిల్లాలుగా విడిపోనుంది. కాగా, ఏపీ సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ స్పందించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల స్వీకరణకు మార్చి 3 తుది గడువు అని వెల్లడించారు. ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతం నుంచి 1,600 అభ్యంతరాలు అందాయని అన్నారు. అభ్యంతరాలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని, అన్ని అంశాలు సమీక్షించి జిల్లాలపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఏప్రిల్ 2 నుంచి పరిపాలన షురూ అవుతుందని తెలిపారు. కాగా, కొత్త జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఉద్యోగుల పంపకం ఉంటుందని విజయ్ కుమార్ వివరించారు.