గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కేంద్రానికి కేటీఆర్ ప్రతిపాదన
మంత్రి కేటీఆర్ తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కేటీఆర్ చొరవతో ఇప్పటికే హైదరాబాద్‌లో తమ ఆర్ అండ్ డీ సెంటర్‌ను రూ.150 కోట్లతో ఏర్పాటు చేసేందుకు కెమ్ వేద అనే సంస్థ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచంలోనే టాప్ గోల్ఫ్ బ్రాండ్‌గా పేరున్న కాల్ అవే సంస్థ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఒప్పుకుంది. ఈ మేరకు కేటీఆర్ ప్రతినిధి బృందంతో ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లో కాల్ అవే సంస్థ డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా 300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ ఎంత మేర పెట్టుబడిని పెట్టనుందన్న విషయం వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే.. చర్చల్లో భాగంగా హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌తో పాటుగా గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కోసం రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలంటూ కేటీఆర్ కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లుగా ఆ కంపెనీ తెలిపింది.
కాగా, 3.2బిలియన్ల డాలర్ల వార్షిక రెవెన్యూ గల ప్రపంచ ప్రఖ్యాత కాల్అవే గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రముఖులు మంగళవారం చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు.