వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 21న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా దాదాపు 68 ఎకరాల స్థలంలో 24 అంతస్తులతో విశాలమైన భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలును తరలించి కొత్త హాస్పిటల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయభాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బుధవారం పరిశీలించారు.
రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఈ సందర్భంగా భవన నిర్మాణ ప్రతిపాదనలను ప్రజాప్రతినిధులకు వివరించారు. సీఎం కేసీఆర్ పర్యటనకు అనుగుణంగా ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని మంత్రి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గత నెల 21న సీఎం కేసీఆర్ వరంగల్‌కు వచ్చినప్పుడు సెంట్రల్ జైలు స్థలంలో హాస్పిటల్ నిర్మిస్తామని ప్రకటించారని, నెల రోజుల్లోనే కొత్త హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలుపెడుతున్నారని దయాకర్‌రావు అన్నారు. కొత్త హాస్పిటల్ భవన నిర్మాణం ఏడాదిలోనే పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.