జాతీయం ముఖ్యాంశాలు

కొవాగ్జిన్ రెండు డోస్‌లతో కోవిడ్ నుండి పూర్తిగా రక్షణ

ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

కరోనా టీకా కొవాగ్జిన్ అద్భుతంగా పనిచేస్తోందని, అన్ని వేరియంట్లను ఇది తిప్పికొడుతోందని మరోమారు రుజువైంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రగ్యా యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనలు అత్యంత అధికస్థాయిలో ఉంటున్నట్టు తేలింది. మరీ ముఖ్యంగా బీటా, డెల్టా, ఒమిక్రాన్‌లను ఇది సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు.

వివిధ వయసుల వ్యక్తుల్లో ఈ టీకా ఎలా పనిచేస్తోందన్నదానిపై ఈ అధ్యయనం నిర్వహించారు. టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని అధ్యయనం చేశారు. రెండో డోసు తీసుకున్న 43 రోజుల తర్వాత బ్రేక్ త్రూ కేసులు నమోదవుతున్నప్పటికీ, 95 శాతం కేసుల్లో లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నట్టు గుర్తించారు.

రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన వారిలో అన్ని రకాల వేరియంట్లను సమర్థంగా తిప్పికొట్టేలా రోగనిరోధక ప్రతిస్పందనలు కనిపించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, రెండో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత టీకా కారణంగా వచ్చిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతున్నట్టు గుర్తించామని, కాబట్టి బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా అన్ని రకాల వేరియంట్ల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.