గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ కాంగ్రెస్ ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పార్టీపై అసంతృప్తి వున్న మాట వాస్తవమే గానీ.. కాంగ్రెస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థమే కావడం లేదన్నారు. ఎవరు వ్యాప్తి చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ పార్టీ కార్యకలాపాలకు 100 శాతం న్యాయం చేశానని, ఇకపై కూడా ఇలాంటి న్యాయమే చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీలో లుకలుకలు, ఆధిపత్య పోరు ఉన్న మాట మాత్రం వాస్తవమేనని, అయినా అందరమూ కలసి కట్టుగా పనిచేస్తామని, గుజరాత్ అభివృద్ధి కోసం పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు. అయితే నిజాలు మాట్లాడితే.. తప్పనుకుంటే తానేమీ చేయలేనని, గుజరాత్ ప్రజలు పార్టీపై ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.
సరిగ్గా కాంగ్రెస్ అధిష్ఠానం గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన సమయంలోనే కాంగ్రెస్ నేత హార్థిక్ పటేల్ సొంత పార్టీపైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ పీసీసీలో కొందరు తనను పక్కన పెట్టేస్తున్నారని, పార్టీ వీడి వెళ్లేలా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పీసీసీ తనను అష్టకష్టాలూ పెడుతోందని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ చేసుకున్న వరుడిలా తన పరిస్థితి తయారైంది అంటూ హార్థిక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లానని, అయినా ఫలితం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.