జాతీయం

హార్థిక్ పటేల్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ లోకి ఆహ్వానించిన గుజరాత్ చీఫ్‌ గోపాల్‌

తమ పార్టీలో చేరాలని ఆప్‌ గుజరాత్ చీఫ్‌ గోపాల్‌ గుజరాత్ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హార్థిక్ పటేల్‌ను శుక్రవారం ఆహ్వానించారు. అంకిత భావం ఉన్న అలాంటి వ్యక్తులకు కాంగ్రెస్‌ పార్టీలో స్థానం లేదని విమర్శించారు. గుజరాత్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై హార్థిక్ పటేల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘హార్థిక్ పటేల్‌కు కాంగ్రెస్‌లో అసంతృప్తిగా అనిపిస్తే, ఆప్‌ వంటి ఇష్టమైన పార్టీలో ఆయన చేరవచ్చు. కాంగ్రెస్‌ అధిష్ఠానికి ఫిర్యాదు చేసి సమయం వృథా చేయడం కన్నా, ఆప్‌కు సహకరించవచ్చు. ఆయన లాంటి అంకిత భావం ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్‌ వంటి పార్టీలో చోటు ఉండదు’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వదంతులను గుజ‌రాత్ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ ప‌టేల్ ఖండించారు. పార్టీపై అసంతృప్తి ఉన్న మాట వాస్త‌వ‌మే గానీ.. తాను కాంగ్రెస్ వీడుతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల్లో మాత్రం నిజం లేద‌ని శుక్రవారం స్ప‌ష్టం చేశారు. అస‌లు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో, ఎవ‌రు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.