తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత కొద్దీ రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో యాత్ర చేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస కార్యకర్తలు యాత్రకు నిరసన తెలిపే యత్నం చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బిజెపి కార్య కర్తలకు , తెరాస కార్య కర్తలకు మధ్య మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలు వాహనాల అద్దాలు ధ్వసం కాగా..పలువురు గాయపడ్డారు.
ఈ దాడిని బిజెపి నేతలు ఖండించారు. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటం ఓర్వలేకనే తెరాస నేతలు దాడులు చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించగా..ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అవాంఛనీయమన్నారు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల. సీఎం ఎలాగూ ఫాంహౌస్ దాటి బయటికి రారని, ప్రతిపక్ష నాయకులు సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి వస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలు సమస్యలను విన్నవిస్తే దౌర్జన్యంగా కొట్టడం అమానుషమని, ప్రశాంతంగా ఉన్న నడిగడ్డలో హింసను ప్రేరేపించేలా దాడి చేయడం ఏమిటని అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహాం ప్రశ్నించారు.