రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లే అని చెప్పకనే చెప్పాడు. “ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. వారి సమస్యల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, జన సురాజ్‌కు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరంభం బిహార్ నుంచే..” అని ట్వీట్ చేశారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆఖర్లో కీలక పదవికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి విముఖత వ్యక్తం కావడం, ప్రాధాన్యత లేని పదవిని కాంగ్రెస్ ఆయనకు ఆఫర్ చేయడంతో పార్టీలో చేరే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు రాజకీయ వ్యూహకర్తగా బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు అక్కడి నుంచే ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన చేయడం గమనార్హం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై పీకే మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆయన కొత్తగా పార్టీ పెడతారా, ఏదైనా దిగ్గజ పార్టీలో చేరి తన అజెండాను ముందుకు తీసుకెళ్తారా అని చూడాల్సి ఉంది.