శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం..చేతులెత్తేసిన ప్రభుత్వం
మాజీ ప్రధాని మహింద రాజపక్స కుటుంబం ఓ నావికాదళ స్థావరంలో తలదాచుకుంది. దేశంలో నిరసనలు హింసాత్మక రూపుదాల్చిన నేపథ్యంలో, మాజీ ప్రధాని రాజపక్సతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓ హెలికాప్టర్ లో ట్రింకోమలీలోని ఓ నేవీ బేస్ కు తరలించారు. కాగా, రాజపక్స కుటుంబం ఆశ్రయం పొందుతున్న నేవీ స్థావరం ఎదుట కూడా నిరసనలు భగ్గుమంటున్నట్టు తెలిసింది. ఈ నావికాదళ స్థావరం రాజధాని కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న కొలంబో వెలుపల ఆందోళనకారుల ఆగ్రహావేశాలకు గురైన అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకోరల భయంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే.
కాగా, ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స తప్పుకున్న అనంతరం రాత్రికిరాత్రే ఆయన అధికారిక నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు గుమికూడారు. దాంతో అక్కడికి భారీ ఎత్తున భద్రతాబలగాలను తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు, హెచ్చరికగా పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో, సూర్యోదయానికి ముందే హెలికాప్టర్ లో మహింద రాజపక్స కుటుంబాన్ని తరలించారు.