అంతర్జాతీయం

ద‌క్షిణ కొరియా కొత్త అధ్య‌క్షుడిగా యూన్ సుక్ యోల్ బాధ్యతలు

ద‌క్షిణ కొరియా దేశాధ్య‌క్షుడిగా యూన్ సుక్ యోల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అర్థరాత్రి ఆయ‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మాజీ న్యాయ‌వాది అయిన యూఎన్ మార్చిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే ప్ర‌మాద‌క‌రంగా మారిన ఉత్త‌ర కొరియాతో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ఏడాది ఇప్ప‌టికే 15 సార్లు క్షిప‌ణుల‌ను ఉత్త‌ర కొరియా ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. దీని ప‌ట్ల ద‌క్షిణ కొరియా ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేశారు.

కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన యూన్ సుక్‌.. ఉత్తర కొరియాతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. 61 ఏళ్ల యూన్ త‌న స్క్రిప్ట్‌ను తానే రాసుకుంటున్నారు. ఫ్రీడ‌మ్‌, మార్కెట్‌, ఫెయిర్‌నెస్ అంశాల‌పై ఆయ‌న ప్ర‌సంగించారు. 26 ల‌క్ష‌ల డాల‌ర్ల ఖ‌ర్చుతో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం నిర్వ‌హించారు. సుమారు 40 వేల మంది గెస్ట్‌ల‌ను ఆహ్వానించారు. చైనా ఉపాధ్య‌క్షుడు వాంగ్ కిషాన్‌, జ‌పాన్ విదేశాంగ మంత్రి యోషిమాష హ‌య‌షీ, అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్ భ‌ర్త డ‌గ్ ఎమాఫ్‌లు ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రయ్యారు.