చార్‌ధామ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి చార్ ధామ్ యాత్రకు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఉత్తర ఖండ్ లో ఒక్కసారిగా అదుపుతప్పి 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, ఒక హెల్పర్, మరో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి ఈ ప్రమాదంలో 26 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు అధికారులు శ్రమించి 17 మృతదేహలను బయటకు తీశారు. ప్రమాద స్థలానికి ఆ ప్రాంత అధికారులు చేరుకున్నారు.
యాత్రికులంతా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలానికి వైద్యుల బృందంతోపాటు అంబులెన్సులు తరలించినట్లు జిల్లా కలెక్టర్ అభిషేక్ రుహేలా తెలిపారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్‌లలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పన్నా వాసులు మూడు బస్సుల్లో చార్‌ధామ్ యాత్రకు బయలుదేరగా.. ఇందులో ఒక బస్సు ప్రమాదానికి గురైంది.
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అదే విధంగా, చనిపోయిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పన ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. కేంద్ర మంత్రులు.. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.