తెలంగాణ ముఖ్యాంశాలు

కేసీఆర్‌.. సింబల్‌ ఆఫ్‌ తెలంగాణ

  • ఈ ప్రాంతంపై పేటెంట్‌ కేసీఆర్‌కే
  • ప్రజలంతా ఆయనతోనే ఉన్నారు
  • ఇది ఎవరూ కాదనలేని నిజం
  • హుజూరాబాద్‌లో ఈటల గెలవడు
  • బీజేపీలో చేరికతో ఆయనకున్నఉద్యమకారుడి ముద్ర పోయింది
  • సీఎం నిలిపినవారిదే గెలుపు
  • సీపీఐ జాతీయనేత నారాయణ

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరిని అభ్యర్థిగా నిలిపితే వాళ్లే గెలుస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. ‘తెలంగాణపై ఇప్పటికీ పేటెంట్‌ హక్కులు కేసీఆర్‌కే ఉన్నాయి. కేసీఆర్‌.. సింబల్‌ ఆఫ్‌ తెలంగాణ. ఇది ఎవరూ కాదనలేని నిజం’ అని స్పష్టంచేశారు. ఈటల రాజేందర్‌ బీజేపీ గొడుగు కిందకు చేరడంతో ఆయనపై ఉన్న ఉద్యమకారుడనే ముద్రపోయిందని శుక్రవారం ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ఈటలపై సానుభూతి ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆయన బీజేపీలో చేరడంతో గెలుపునకు ఉన్న తలుపులు మూసుకుపోయాయని విశ్లేషించారు. ‘మాకు ఈటలపై వ్యక్తిగతంగా సానుభూతి ఉన్నప్పటికీ, బీజేపీలో చేరడంతో ఇప్పుడు మద్దతు ఇవ్వలేం. వ్యక్తిగత ఇమేజ్‌తో ఓట్లు వస్తాయన్న అంచనా కూడా సరికాదు. ఇన్నేండ్లు టీఆర్‌ఎస్‌ గొడుగు కింద ఉన్నందున ఒక ఇమేజ్‌ వచ్చింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ గొడుగుపోయి, బీజేపీ గొడుగు వచ్చింది. బీజేపీ వల్ల ఈటలకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. తెలంగాణ అంటే భక్తిభావన ఉన్నవారు ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ పక్షాన, సీఎం కేసీఆర్‌తోనే ఉన్నారు. తెలంగాణపై ఇప్పటికీ పేటెంట్‌ హక్కులు కేసీఆర్‌కే ఉన్నాయి. కేసీఆర్‌.. సింబల్‌ ఆఫ్‌ తెలంగాణ. ఇది ఎవరూ కాదనలేని నిజం. గత ఎన్నికలప్పుడు ఈటలను కేసీఆర్‌ నిలబెట్టారు. ఈటల గెలిచారు. ఇప్పుడు ఎవరో ఒకరిని పెడ్తారు. సీఎం కేసీఆర్‌ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలుస్తారు. దీంట్లో సందేహమే లేదు. టీఆర్‌ఎస్‌కే హుజూరాబాద్‌లో విజయావకాశాలున్నాయి. దీంట్లో అనుమానాలు లేవు. బీజేపీ వాళ్లు దుబ్బాక మాదిరిగా హడావుడి చేస్తారు. చివరకు ఫలితం టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంటుంది’ అని విశ్లేషించారు. అటు.. మోస్ట్‌ అన్‌పాపులర్‌ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందని నారాయణ పేర్కొన్నారు.